జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామ శివారులోని ఓ వెంచర్‌లో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి చేసి పది మందిని అరెస్టు చేశారు. ప్రధాన నిర్వాహకుడు రాంబాబు అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు.
జక్రాన్‌పల్లి ఎస్‌ఐ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్‌కు చెందిన రాంబాబు అర్గుల్ గ్రామ శివారులోని వెంచర్‌లో గుట్టుగా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ మహేశ్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని దాడి చేశారు.
ఈ సందర్భంగా కోడిపందాల్లో పాల్గొన్న నిజామాబాద్‌కు చెందిన ఐదుగురు, హైదరాబాద్‌కు చెందిన మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.పోలీసుల రాకను గమనించిన ప్రధాన నిర్వాహకుడు రాంబాబు అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు.
దాడిలో నిందితుల వద్ద నుంచి రూ.15,323 నగదు, 11 సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్రవాహనాలు, రెండు కార్లు, రెండు పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రధాన నిర్వాహకుడు రాంబాబు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కోడిపందాల నిర్వహణ వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
