దశాబ్ద కాలంగా ఊరిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు పక్రియ లో ఇంకా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు . ప్రభుత్వ ఇంకా మీన మేషాలు లెక్కిస్తుంది. ఏడాది ప్రజా పాలన ఉత్సవాలను ఊరువాడా చేసి సంబర పడ్డ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు జిల్లా కు ఎంతో కాలంగా పెండింగ్ లో ఈ కాలేజీ ఏర్పాటు విషయంలో కనీస చొరవ చూపలేక పోతున్నారు.
అసలు ఏడాది కాలంగా విద్యాశాఖ మంత్రే లేక పోవడంతో కాలేజీ కోసం ఎవరిమీద ఒత్తిడి చేయాలో అర్థం కానీ దుస్థితి ఉంది. ఇప్పటికే అనేక విద్యార్ధి సంఘాలు జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ మంజూరి చెయ్యాలని గొంతెత్తుతూనే ఉన్నాయి.పదేళ్లు అధికారం లో ఉన్న బిఆర్ యస్ సైతం ఇదే తరహాలో గప్పాలు కొడుతూ కాలక్షేపం చేసింది.
రోజు ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత లు సైతం కాలేజీ ఏర్పాటు విషయంలో కనీస శ్రద్ద చూపలేక పోయారనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏడాది క్రితం అధికారంలో కి వచ్చింది. జిల్లానుంచి ఇద్దరు ఎమ్మెల్యే లున్నారు. కానీ మంత్రి మండలి లో జిల్లాకు ఇంకా ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.
ఉన్న ఇంచార్జి మంత్రి జూపల్లి జిల్లావైపు కన్నెత్తి కూడా చూడరు. గతంలో జిల్లాలో విద్యా వ్యవస్థ లో కాపీయింగ్ వ్యవస్థ ఫై ఉక్కుపాదం వేయించిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కే ఈసారి విద్యా శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది దీనితో ఆయన మంత్రి అయితే ఇంజనీరింగ్ కాలేజీ పక్కగా ఏర్పాటు అవుతుందని అంతా ఆశించారు కానీ ఆయనకు మంత్రి మండలి లో చోటు దక్కడమే లేదు.
సీఎం రేవంత్ కు దగ్గరి బంధుత్వం ఉన్నప్పటికీ ఆయన కాలేజీ విషయంలో గట్టిగా పట్టు పట్టలేక పోతున్నారు. గతంలో యునివర్సిటీ ఏర్పాటు విషయంలోనూ ప్రభుత్వంలో ఇదే నాన్చుడు ధోరణి ఉండే కానీ విద్యార్ధి యువజన సంఘాలు ఒక్కసారి రోడెక్కడం ఉన్నత విద్యాశాఖ మంత్రి గా జిల్లాకు చెందిన డీఎస్ వుండడం తో తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేసే విషయంలోనూ అదే తాత్సరం జరుగుతుంది.
కాలేజీ ఏర్పాటు చేసే విషయంలో జేఎన్టీయూ తో పాటు ఉస్మానియా యునివర్సిటీ సైతం ఆసక్తిగా ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీ ఉస్మానియా కు అనుబంధంగా నే ఉంది. తెలంగాణ యునివర్సిటీ లో అవసరమైన భూములు భవనాలు సైతం అందుబాటు లో ఉన్నాయి కొత్తగా వచ్చిన వీసీ సైతం ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
కానీ ప్రభుత్వ పెద్దలను కదిలించే స్థాయి వీసీ కి వుండదు అందుకే అధికార పార్టీ పెద్దలే చొరవ చూపెట్టాలి. యూనివర్సిటీ మెడికల్ కాలేజీ లను జిల్లాకు మంజూరు చేసి ఖ్యాతి పొందిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దశాబ్దల కల గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు కోసం అడుగు ముందుకేయాలి.
