జాన రమేష్; ఇది సంగతి:ఆర్మూర్;
ప్రమాదవశాత్తు ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు వేగంగా ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులో కరీంనగర్ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో ఓ లారీ రహదారిపై సంపూర్తిగా దగ్ధమైపోయింది. అందులో ఇరుక్కున్న ఇరువురిని గమనించిన స్థానికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
పెర్కిట్ శివారులో జాతీయ రహదారి 63పై గుజరాత్ నుండి విశాఖపట్నం వైపు గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ, కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న మరో లారీని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గ్రానైట్ లోడ్ తో వెళ్తున్న లారీ పూర్తిగా దగ్ధమైంది.
ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకోగా, మిగతా ఇద్దరు క్యాబిన్లో ఉన్న సమయంలో మంటలు వ్యాపించడంతో స్థానికులు వారిని కాపాడారు. కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ కి కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రవికుమార్ తో పాటు ఎస్ఐ అశోక్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
అగ్నిమాపక సిబ్బంది దగ్ధమవుతున్న లారీ మంటలను ఆర్పి వేశారు. జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.