సారంగాపూర్ (13వ డివిజన్) పరిధిలోని సర్వే నంబర్ 231లో గల ప్రభుత్వ భూమిని తక్షణమే స్థానిక నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి ఆ సర్వే నెంబర్ గల భూమిని పేదలకు పంపిణీ చేయాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో మగ్గుతున్న తమకు, ఈ 10 ఎకరాల భూమే చివరి ఆశ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సారంగాపూర్ ప్రాంతంలో ఇప్పటికే విలువైన అసైన్మెంట్ భూములు, చెరువు శిఖం భూములు అక్రమార్కుల పాలయ్యాయని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారు, వ్యాపారవేత్తలు భూములను కబ్జా చేస్తున్నా అధికారులు మౌనం వహిస్తున్నారని దుయ్యబట్టారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులోనూ తమకు అన్యాయం జరిగిందని, స్థానికేతరులకు, అనర్హులకే ప్రాధాన్యత లభించిందని వారు ఆరోపించారు.
ప్రభుత్వ భూమిని పేదలకు పంచాల్సి ఉండగా, ఇప్పుడు అక్కడ స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తామనడం సమంజసం కాదని బాధితులు పేర్కొన్నారు.మా పిల్లల భవిష్యత్తు కోసం స్టేడియం కంటే ముందు తల దాచుకోవడానికి నీడ ముఖ్యం.
ఎన్నో ఏళ్లుగా విన్నవించుకుంటున్నా మా మొర ఎవరూ ఆలకించడం లేదు. ఈ పది ఎకరాల భూమిని ప్లాట్లుగా మార్చి మాకు పంపిణీ చేయాలనీ పేర్కొన్నారు.
అన్యాక్రాంతం కాకుండా చూడండిఏదో ఒక సాకుతో ఈ భూమిని అన్యాక్రాంతం చేయకుండా కాపాడాలని, ఇక్కడ ఎలాంటి ఇతర నిర్మాణాలు చేపట్టకుండా కేవలం పేదల ఇళ్ల కోసమే కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ 13వ డివిజన్‌కు చెందిన పెద్ద సంఖ్యలో బాధితులు, మహిళలు పాల్గొన్నారు.
