HomeHEALTHపేదల పాలిట ‘సూపర్’ భరోసా! సూపర్ స్పెషాలిటీగా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి..

పేదల పాలిట ‘సూపర్’ భరోసా! సూపర్ స్పెషాలిటీగా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి..

ఒకప్పుడు అత్యవసర చికిత్సలు, సాధారణ వైద్య సేవలకు మాత్రమే పరిమితమైన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి.. ఇప్పుడు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆసుపత్రిలో దశలవారీగా అత్యాధునిక వైద్య విభాగాలు అందుబాటులోకి రానుండటంతో నిజామాబాద్‌తో పాటు కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల ప్రజలకు నాణ్యమైన వైద్యం జిల్లా కేంద్రంలోనే లభించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

క్లిష్ట వ్యాధులతో బాధపడేవారు ఇకపై పెద్దఎత్తున హైదరాబాద్ ఆసుపత్రులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గనుంది. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో ఆసుపత్రి సేవల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఆధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు, విస్తరించిన ప్రత్యేక విభాగాలతో ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది.

గతంలో ఇతర ప్రాంతాలకు రిఫర్ చేసిన అనేక కేసులకు ప్రస్తుతం జిల్లాలోనే విజయవంతంగా చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే గుండెకు స్టెంట్లు వేయడం, ప్లాస్టిక్ సర్జరీలు వంటి క్లిష్ట వైద్య సేవలు అందుబాటులో ఉండటం ప్రభుత్వ వైద్య రంగంలో కీలక ముందడుగుగా నిలిచింది.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించిన మేరకు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను దశలవారీగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. అత్యాధునిక ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు కూడా తుదిదశకు చేరుకుంది.

ఈ సేవలు అందుబాటులోకి వస్తే గుండె, మెదడు, మూత్రపిండాలు, మూత్రనాళాలకు సంబంధించిన క్లిష్ట వ్యాధులకు జిల్లాలోనే చికిత్స పొందే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో రోజుకు సుమారు రెండు వేల మంది ఓపీ రోగులు, ఐదు వందల మంది ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతున్నారు.

పెరుగుతున్న రోగుల సంఖ్య, అందుతున్న ప్రత్యేక వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

దశాబ్దాలుగా పేదలకు ఆశ్రయంగా నిలిచిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి.. ఇక సూపర్ స్పెషాలిటీ సేవలతో అభయహస్తం అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిర్ణయం వేగంగా అమలైతే ఉత్తర తెలంగాణలో ఆరోగ్య రంగానికి నిజామాబాద్ కేంద్రబిందువుగా మారడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments