నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుకస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) వ్యవహారంలో నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు.
రైస్ మిల్లుల్లో జరిగినట్లు గుర్తించిన అవకతవకలపై ఇప్పటివరకు నమోదైన కేసుల పురోగతిని మంగళవారం పోలీస్ కమిషనరేట్‌లో సమీక్షించారు.
ఈ సందర్భంగా నమోదైన కేసుల దర్యాప్తు స్థితి, స్వాధీనం చేసుకున్న ధాన్యం, బియ్యం, సంబంధిత రికార్డుల పరిశీలన, నిందితులపై చేపడుతున్న చట్టపరమైన చర్యలు, పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ తదితర అంశాలను కమిషనర్ సమగ్రంగా సమీక్షించారు.
ప్రభుత్వానికి నష్టం కలిగించే అక్రమాలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సీఎంఆర్ ధాన్యం, బియ్యం నిర్వహణలో పూర్తిస్థాయి పారదర్శకత పాటించాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
సివిల్ సప్లై శాఖ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి అవకతవకలు పునరావృతం కాకుండా నిరంతర తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, జిల్లా సివిల్ సప్లై అధికారి ఎం. శ్రీకాంత్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మల్లేష్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆర్. అంజయ్య, జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ ప్రవీణ్, అసిస్టెంట్ మేనేజర్ అరవింద్ రెడ్డి, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు దయానంద్ గుప్తా, రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
