లింగంపేట మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై కోటి రూపాలతో నిర్మించిన తాత్కాలిక వంతెన నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వచ్చిన వరద తాకిడికి కొట్టుకు పోయింది. ఎల్లారెడ్డి- కామారెడ్డి రూట్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
గత యేడు కురిసిన భారీ వర్షానికి లింగంపల్లి సమీపంలోని పాముల వాగు వంతెన కొట్టుకు పోయింది. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి వరదలకు కొట్టుకుపోయిన వంతెనను సందర్శించారు.ప్రయాణికులకు,వాహన రాకపోకలకు ఇబ్బంది కలగకుండా కోటి రూపాయల నిధులను మంజూరు చేయగా.అధికారులు తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు.
సంవత్సర కాలం గడిసిన పూర్తి స్థాయి వంతెన నిర్మాణం కాకపోవడంతో సోమవారం రాత్రి గాంధారి, లింగంపేట్ మండలాల్లో భారీ వర్షం కురవడంతో పెద్దవాగు, పాముల వాగు ఉదృతంగా ప్రవహించడంతో వరద నీరు తాత్కాలిక వంతెన పైనుండి ప్రమాద కరంగా ప్రవహించడంతో వంతెన కోతకు గురైంది.
కోటి నిధులతో నిర్మించిన తాత్కాలిక వంతెనకు నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం, వాగుపై సిమెంట్ పైపులు వేసి పైన మొరం పోసి వంతెన నిర్మాణం చేపట్టగా, కొద్ది పాటి వర్షానికే వంతెన కోతకు గురికావడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
వాహనాలు, ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కరంగా మారడంతో ప్రజలు ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. ఎగువ ప్రాంతంలో రాత్రి కురిసి భారీ వర్షానికి నాగారం వంతెన పైనుండి నీరు ప్రవహించడంతో కోర్పోల్, బాణాపూర్ గ్రామాలకు రాకపోకలు నిచిపోయాయి.పాములవాగు ఉధృతంగా ప్రవహించడంతో మండలంలోని ఐలాపూర్, రాంపల్లి గ్రామాల మధ్య గల లో లెవెల్ వంతెన పొంగి ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
మండల కేంద్రంలోని పెద్దవాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. స్థానిక సర్పంచ్ పోలీసుల సహాయంతో రాకపోకల పునరుద్ధరించారు.పాములవాగు వంతెన కోతకు గురవడంతో స్థానిక సర్పంచ్ గొల్ల ప్రత్యూష సాయిరాం యాదవ్ స్థానిక ఎస్సై దీపక్ కుమార్ సమాచారం అందించి, పోలీసు సిబ్బందితో పాములవాగు వంతెనకు ఇరువైపులా ఉదయం 5 గంటలనుండి వాహనాలు రాకుండా ట్రాక్టర్లను అడ్డుపెట్టి బారికేడ్లను ఏర్పాటు చేయించారు.
ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. భారీ వాహనాలకు అనుమతించకుండా,ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్ర చేశారు.
