రమేష్ : ఇది సంగతి : ఆర్మూర్:వేల్పూర్ మండలం పోచంపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పడిగెల గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు గాదేపల్లి రమేష్ అక్కడికక్కడే కారు ప్రమాదంలో మృతి చెందాడు.
మరిన్ని వివరాలలోకి వెళ్తే… వేల్పూర్ మండలం పోచంపల్లి శివారులో వరద కాలువ కింద ఉన్న పోచంపల్లి మత్తడి కాలువలో ప్రమాదవశాత్తు తన కారును రివర్స్ తీయబోయి కాలువలో పడి నీట మునిగి అక్కడికక్కడే రమేష్ మృతి చెందాడు.
వ్యవసాయ పనుల నిమిత్తం పడిగెల గ్రామానికి చెందిన గాదేపల్లి రమేష్ తన వ్యవసాయ క్షేత్రానికి కూలీలను తీసుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనతో పాటు ఉన్న కూలీలను కారు దించి రివర్స్ తీసే ప్రయత్నం చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఒకవేళ కూలీలు కూడా కారులో ఉండి ఉంటే ఘోర ప్రాణ ప్రమాదం జరిగి ఉండేది. ఒకసారిగా పక్కనే ఉన్న మత్తడి కాలువలోకి కారు పడిపోవడంతో కాలువలో నిలిచి ఉన్న నీటిలో కారు మునిగిపోయింది.
దీంతో రమేష్ ప్రాణాలు నీట కలిశాయి. వెంటనే సమాచారం అందుకున్న వెల్పూర్ పోలీసులు, స్థానిక జాలర్లు క్రేన్ సహాయంతో కారును బయటకు వెలికి తీసి అద్దాలను పగలగొట్టి రమేష్ మృతదేహాన్ని బయటకు తీశారు.
మృతుడు గాదేపల్లి రమేష్ కు భార్య కొడుకు ఉన్నారు. కొడుకు అమెరికాలో ఉంటున్నట్లు గ్రామస్తులు ద్వారా తెలిసింది.




