క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న సీఎం రేవంత్ పైనే ముందుగా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ ఢిల్లీ లో బుధవారం మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ నాయకత్వ తీరుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ప్రయత్నం జరిగితే ఊరుకునేది లేదని,తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల వివాదంపై స్పందిస్తూ.. తన కూతురు మాట్లాడిన దానికి నన్ను ఎలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించారు. తనపై చర్యలు తీసుకోవాలని చూడటం ఏ రకమైన న్యాయమని కామెంట్ చేశారు.
ఓవైపు మహిళలు స్వతంత్రంగా ఎదగాలని, తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా చెబుతున్నారని గుర్తుచేశారు.
తన కూతురిని కొన్ని పరిణామాలు రెచ్చగొట్టినందుకే ఆమె విమర్శలు చేయాల్సి వచ్చిందని, కుటుంబ సభ్యుడి అభిప్రాయాలకు మంత్రిని బాధ్యురాలిగా చేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు.
