ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా విమర్శించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ ధర్నాచౌక్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ఆధ్వర్యంలో 420 అడుగుల పొడవైన ఫ్లెక్సీని ప్రదర్శించి నిరసన తెలిపారు.
అందులో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముద్రించి ప్రజలకు చూపించారు.ఈ సందర్భంగా గణేష్‌గుప్తా మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో అమలైన పథకాలకు రెట్టింపు ప్రయోజనాలు అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. పెన్షన్ రూ.4 వేలకు పెంచడం, దంపతులిద్దరికీ పెన్షన్, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, మహిళలకు రూ.2,500, యువతకు స్కూటీలు వంటి హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు గణేష్‌గుప్తా తెలిపారు. రైతులు, యువత, ఆటో కార్మికులు తదితర వర్గాల సమస్యలను ఒక్కో రోజు ప్రస్తావిస్తూ నిరసనలు నిర్వహిస్తామన్నారు.
రైతులకు 24 గంటల విద్యుత్, సమయానికి ఎరువులు, పెట్టుబడి సాయం, రైతుబీమా వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
ఇప్పటికైనా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
