ఆర్మూర్ :సంక్షేమం మీద దృష్టి పెట్టాల్సిన నేతలు సమరానికి ఎందుకు కాలు దువ్వుతున్నారు. పచ్చని పల్లెలో రాజకీయం చిచ్చు పెడుతుందా..? ప్రశాంతంగా ఉన్న బాల్కొండ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి.. నువ్వా.. నేనా.. అంటూ ఎందుకు పీకులాడుతున్నారు.
అసలు బాల్కొండలో ఎందుకు రాజకీయ ఉద్రిక్తత ఏర్పడింది… అని నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయం రావణ కష్టానికి చేరితే తీర్పునివ్వాల్సిన సామాన్యుడు ఆశ్చర్యానికి లోనవుతున్నాడు .
నేతలను నమ్ముకున్న సామాన్య కార్యకర్తలు రోడ్డుపై బాహాబాహికి దిగుతుంటే… వారిని పురికొల్పిన నాయకులు మాత్రం తెరవెనకే పాత్రను పోషిస్తున్నారు . ఈ రాజకీయ ముష్టి యుద్ధంలో మిగిలేది ఏమిటి..? ఒరిగేది ఎవరికి…? సంక్షేమం మీద దృష్టి పెట్టాల్సిన పాలకులకు సమరం ఎందుకు గుర్తుకొస్తుందో అర్థం కాక సగటున సాధారణ వ్యక్తులు అయోమయానికి గురవుతున్నారు.
అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే బాధ్యత అధికార పక్షానికి ఉంటుంది. ఇది ఒక ఆరోగ్యవంతమైన సమాజానికి ఉపయోగపడే రాజకీయం.
గత ఆరు నెలలలో మొదటిసారి అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో భీంగల్ మున్సిపల్ పరిధిలో ఓ రగడ రాజుకుంటే… దానికి మళ్లీ ఎపిసోడ్ గా నిన్న వేల్పూర్ వేదిక అయింది.
రాజకీయ సామరస్యతకు మారుపేరైన బాల్కొండ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ చూడని వింతైన పరిస్థితులను చూసే దౌర్భాగ్య పరిస్థితి నియోజకవర్గ ప్రజలకు ఎదురైంది. కార్యకర్తలు రోడ్డుపై.. నాయకులు ఒడ్డుపై అన్న చందంగా తయారైంది పరిస్థితి.
రాజకీయంలో పోటీ ఉంటే .. అది సంక్షేమం మీద ఉండాలి, లేదంటే అభివృద్ధి మీద ఉండాలి.. అంతేకానీ అధికార దర్పణం మీద ఆధారపడ్డ ఏ రాజకీయ పార్టీలు మనగడ సాధించలేవు అన్నది చరిత్ర చెబుతున్న నిఖార్సైన నిజం.
కాబట్టి బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బి ఆర్ ఎస్, నాయకులందరూ ఇప్పటికైనా సంక్షేమం మీద ఆశతో ఎన్నుకున్న ప్రజలకు అభివృద్ధిని అందించాలని సామాన్యుడు కోరుతున్నాడు.
ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాలని ఆశిస్తున్నారు. నేతలారా.. ఒకసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచించమని కోరుతున్నారు.
