Thursday, April 16, 2026
HomeCRIMEబోధన్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు!బంగారు దుకాణాల్లో చోరీ చేసిన నిందితుల అరెస్టు..14 తులాల బంగారం,6...

బోధన్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు!బంగారు దుకాణాల్లో చోరీ చేసిన నిందితుల అరెస్టు..14 తులాల బంగారం,6 కిలోల వెండి స్వాధీనం..

బోధన్ పట్టణంలో కొద్దిరోజుల క్రితం కలకలం రేపిన వరుస చోరీల మిస్టరీని బోధన్ పోలీసులు ఛేదించారు. ఏటీఎంలను ధ్వంసం చేయడంతో పాటు, బంగారు దుకాణాల తాళాలు పగులగొట్టి దోచుకునే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బోధన్ టౌన్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.

నిందితుల నుంచి 14 తులాల బంగారం, 6 కిలోల వెండితో పాటు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు..

గత ఏడాది డిసెంబరు 21వ తేదీ అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్‌పై బోధన్ చేరుకొని తొలుత ఆచన్‌పల్లి ప్రాంతంలో ఒక మోటార్ సైకిల్‌ను దొంగిలించిన ఈ ముఠా..

ఆ తర్వాత పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న రెండు బంగారు దుకాణాల షట్టర్ తాళాలు పగులగొట్టారు. దుకాణాల్లోని 35 తులాల బంగారం, 14 కిలోల వెండి నగలను దోచుకుని రెండు వాహనాలపై మహారాష్ట్రలోని ఉమ్రికి పారిపోయినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసును సవాలుగా తీసుకున్న బోధన్ ఏసిపి శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ వి. వెంకట నారాయణ నేతృత్వంలోని బృందం నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసింది.

ఆదివారం రాత్రి ఆచన్‌పల్లి బైపాస్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, రోడ్డు పక్కన వాహనం నిలిపి మద్యం తాగుతున్న నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారన్నారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటాడి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి గ్రామానికి చెందిన లక్ష్మణ్ సింగ్ బవూరి, ప్రేమ్ సింగ్ కిచ్చి లను పట్టుకోగా సాగర్ సింగ్, మహమ్మద్ షేక్ అనే మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో అయినట్లు తెలిపారు.

వీరికి సహకరించిన నయీమ్ నదీమ్ సయ్యద్, లక్ష్మీకాంత్ సంతోష్ (గోల్డ్ స్మిత్)లను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు.వారి నుంచి 14 తులాల బంగారు నగలు,6 కిలోల వెండి వస్తువులు, రెండు మోటార్ సైకిళ్లు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.

అలాగే వీళ్లు చోరీ చేసిన అనంతరం పారిపోతున్న క్రమంలో బోధన్‌లో దొంగిలించిన మోటార్ సైకిల్‌ను, తాళాలు పగులగొట్టేందుకు వాడిన ఇనుప రాడ్లను జారికోట్ గ్రామ శివారులోని నదిలో పారేసినట్లు నిందితులు అంగీకరించారు.

అత్యంత వేగంగా కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న బోధన్ ఇన్‌స్పెక్టర్ వెంకట నారాయణ, ఎస్సై మనోజ్ కుమార్, ఏఎస్సై బాబురావు మరియు సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!