HomePOLITICAL NEWSArmoorఆర్మూర్ 'హస్త'గతం..నియోజకవర్గంలో తలకిందులైన సమీకరణాలు...

ఆర్మూర్ ‘హస్త’గతం..నియోజకవర్గంలో తలకిందులైన సమీకరణాలు…

. సొంత ఊరిలోనూ ఎమ్మెల్యేకు తప్పని పరాభవంఉనికి కోల్పోయిన కమలం, గులాబీ..ఆర్మూర్ నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు పూర్తి భిన్నంగా తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

మొన్నటి వరకు నియోజకవర్గంలో తిరుగులేదని భావించిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), మాజీ ఎమ్మెల్యే ఇలాకాలో పట్టు కోల్పోయిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లను వెనక్కి నెట్టి.. కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో పుంజుకుంది.

నియోజకవర్గంలోని కీలక మండలాలైన నందిపేట, మాక్లూర్ లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, పంచాయతీ ఎన్నికల నాటికి సమరోత్సాహంతో పనిచేశాయి.

పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. గ్రామీణ ఓటర్లు ఈసారి పూర్తిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ఈ ఎన్నికలు పెద్ద షాక్‌ని ఇచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 30 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయన, కేవలం నెలల వ్యవధిలోనే గ్రామీణ ఓటర్ల మద్దతును కోల్పోయినట్లు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా, ఎమ్మెల్యే సొంత గ్రామమైన అంకాపూర్‌లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలుకావడం చర్చనీయాంశమైంది.

నియోజకవర్గ కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో బీజేపీ కనీస ప్రభావం చూపలేకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఆర్మూర్‌లో అట్టర్ ఫ్లాప్‌గా మారింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తీరుపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు క్షేత్రస్థాయి ఫలితాలు చెబుతున్నాయి.

పార్టీ కేడర్‌ను సమన్వయం చేయడంలో ఆయన విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉన్న గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి పుంజుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ పథకాలు, క్షేత్రస్థాయిలో పెరిగిన ఆ పార్టీ పట్టు ఈ విజయానికి దోహదం చేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫలితాలతో ఆర్మూర్ నియోజకవర్గంలో భవిష్యత్ రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments