తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం సోమవారం రోజుల్లో జరుగనున్న గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. 15న ఉదయం 10.00 గంటల నుండి మధ్యాన్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయని, ఆ మరుసటి రోజైన 16వ తేదీన కూడా అవే సమయాలలో రెండు సెషన్ లలో పరీక్షలు జరుగుతాయని వివరించారు. జిల్లాలో మొత్తం 19854 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా మొత్తం 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ లను నియమించామని, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు అనుక్షణం నిశిత పర్యవేక్షణ జరుపుతామని, సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. బయో మెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉదయం పరీక్షకు సంబంధించి 9.30 గంటల వరకే పరీక్షా కేంద్రం లోనికి వెళ్లేందుకు అనుమతించడం జరుగుతుందని, అనంతరం గేట్లు మూసివేస్తారని, మధ్యాహ్నం పరీక్షకు సంబంధించి 2.30 తరువాత ఎవరినీ లోనికి అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రం లోనికి మొబైల్ ఫోన్, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వంటివి తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని, ఈ మేరకు ప్రతి కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించామన్నారు. పరీక్షా సమయం ప్రారంభం నుండి ముగిసేంత వరకు పరీక్ష కేంద్రం నుండి అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్లు కూడా బయటకు వెళ్లకూడదని తెలిపారు. అభ్యర్థులు తమ వెంట పరీక్ష హాల్ టికెట్, బ్లాక్/ బ్లూ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలని. ఏదేని ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్/ డ్రైవింగ్ లైసెన్స్/ఓటర్ కార్డు/ పాన్ కార్డ్/పాస్ పోర్ట్ వంటివి) తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని, హాల్ టికెట్ పై కలర్ ఫోటో అతికించుకోవాలని తెలిపారు. అభ్యర్థులు చెప్పులు వేసుకొని రావాలన్నారు. అభ్యర్థి వివరాలు ముద్రించబడిన ఓ.ఎం.ఆర్ షీట్ పై నలుపు/ నీలం బాల్ పాయింట్ పెన్నుతో బబ్లింగ్ చేయాలని కలెక్టర్ జాగ్రత్తలు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలను ప్రశాంత వాతావరణంలో సాఫీగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు.
గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి ..కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు..
RELATED ARTICLES
