పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉన్నత ఫలితాలు సాధించాలని భవానిపేట ఉపసర్పంచ్ మంజుల రమేష్ గౌడ్ ఆకాంక్షించారు.
బుధవారం భవానిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఆమె పరీక్షా సామాగ్రిని (ఎగ్జామ్ కిట్స్) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ దోమకొండ విజయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి కీలకమైన మెట్టు అని, సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదివి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
సర్పంచ్ విజయ స్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందంతో పాటు వార్డు సభ్యులు మంద సమరసింహారెడ్డి, సన్నాయిల రాజు, కీసరి లావణ్య నరేష్, కారోబార్ నరసింహులు, విద్యార్థులు పాల్గొన్నారు.
