తెలంగాణ కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగిన బలమైన బీసీ నాయకుడు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై ఒక పథకం ప్రకారం ‘బిగ్’ కుట్ర జరుగుతోందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఒక ప్రముఖ టీవీ ఛానల్లో రోజంతా ప్రసారమైన బులెటిన్లలో మహేష్ గౌడ్‌ను ఒక విఫల పీసీసీ చీఫ్‌గా చిత్రీకరించేందుకు పరాకాష్ట స్థాయి విషప్రచారం సాగిందని ఆయన ధ్వజమెత్తారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దుష్ప్రచారం వెనుక ఉన్న శక్తులపై, పార్టీ పెద్దల మౌనంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన రెండు దశాబ్దాల తెలంగాణ రాజకీయ చరిత్రలో ఏ పీసీసీ అధ్యక్షుడిపై కూడా ఇంతటి ఘోరమైన వ్యక్తిగత దాడి జరగలేదని బొబ్బిలి రామకృష్ణ గుర్తుచేశారు.
“మహేష్ గౌడ్‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో బీసీ రాజ్యాధికార కాంక్ష తారాస్థాయికి చేరిందని, భవిష్యత్తులో రాబోయే ఏ ఎన్నికల్లోనైనా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి అన్ని పార్టీలకు ఎదురవుతోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మహేష్ గౌడ్‌కు కీలక స్థానం దక్కనుందని, బీసీ కోటాలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి అప్పగించే అవకాశాలు ఉన్నాయంటూ ఇటీవలి కాలంలో బలమైన ప్రచారం సాగుతోందని రామకృష్ణ తెలిపారు.
ఈ నేపథ్యంలోనే, ఆయన ఎదుగుదలను అణచివేయాలనే కుట్రతో కొందరు స్క్రీన్ వెనుక ఉండి నడిపిస్తున్న పంచరంగుల ‘బిగ్’ కుట్ర ఇదని, తప్పుడు ప్రచారాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ స్వభావాన్ని శతాబ్దాలుగా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన వ్యక్తిత్వం తెలుసని రామకృష్ణ కొనియాడారు.
“పార్టీలు ఏదైనా, అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన అందరితో సన్నిహితంగా ఉంటారు. తన వద్దకు సమస్యతో వచ్చే వారికి పరిష్కారం చూపుతారే తప్ప, ఎవరినీ నొప్పించని మృదుస్వభావి” అని స్పష్టం చేశారు. అలాంటి నిష్కళంకమైన నేతపై జరుగుతున్న ఈ విషపూరిత దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఛానల్లో ఇంతటి దారుణమైన బులెటిన్లు వస్తున్నా మహేష్ గౌడ్‌కు మద్దతుగా ఒక్క గొంతు కూడా లేవకపోవడం శోచనీయమన్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ ‘బిగ్’ కుట్రపై స్పందించకుండా మౌనం వహిస్తే, అది పార్టీ పరంగా ఒక చారిత్రక తప్పిదమే అవుతుందని బొబ్బిలి రామకృష్ణ హెచ్చరించారు. అధిష్ఠానం తక్షణమే స్పందించి బీసీ నాయకత్వాన్ని కాపాడుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
