నగరంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఏటీఎంలో చోరీకి జరిగిన యత్నం తీవ్ర కలకలం రేపింది. అయితే, సాంకేతిక పరిజ్ఞానం సకాలంలో స్పందించడం, పోలీసులు మెరుపువేగంతో రంగంలోకి దిగడంతో తృటిలో ముప్పు తప్పింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… నగరంలోని ఒకటో పోలీస్ స్టేషన్ పరిధి లోని పోచమ్మ గల్లీ లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి అర్ధరాత్రి సమయంలో ఇద్దరు దుండగులు చొరబడ్డారు. మొదట వారు తమ వద్ద ఉన్న డెబిట్ కార్డును మిషన్‌లో ఉంచి, డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించారు.
అయితే సాంకేతిక కారణాల వల్ల నగదు రాకపోవడంతో దొంగల అసలు స్వరూపం బయటపడింది. ఎట్లైనా డబ్బులు కొట్టేయాలనే దురాశతో ఏటీఎం యంత్రాన్ని గట్టిగా పట్టుకుని ఊపడం ప్రారంభించారు.
దుండగులు ఏటీఎం మిషన్‌ను బలంగా కదిలించడంతో తక్షణమే అందులోని సెక్యూరిటీ సైరన్ (అలారం) పెద్ద శబ్దంతో మోగింది. దీంతో సర్వర్‌కు, స్థానిక పోలీసులకు సైతం ఆటోమేటిక్‌గా అలర్ట్ మెసేజ్ వెళ్ళింది.
అలారం మోగిన వెంటనే ఒకటో టౌన్ పోలీసులు క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏటీఎం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అక్కడికక్కడే చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను విచారిస్తున్నట్లు ఒకటో టౌన్ పోలీసులు తెలిపారు.
