నగరంలోని ఖిల్లా ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం తప్పింది. స్థానిక పోచమ్మ గుడి సమీపంలో ఉన్న కండి ప్రశాంత్ అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.అగ్నిమాపక శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం…ఇంటి లోపల పశువుల కోసం నిల్వ ఉంచిన గడ్డి కట్టలకు ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు అంటుకున్నాయి.
గడ్డి వేగంగా కాలిపోవడంతో క్షణాల వ్యవధిలోనే ఇల్లంతా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టుపక్కల ఇళ్లు చాలా దగ్గరగా ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ బృందం ల్యాండ్ రోవర్/ఫైర్ టెండర్తో ఘటనా స్థలానికి చేరుకుంది. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి, మంటలు పక్కన ఉన్న ఇళ్లకు వ్యాపించకుండా సకాలంలో అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సిబ్బంది సేవలను కాలనీ వాసులు అభినందించారు.
