పెండ్లి కి వెళ్తున్న కారు కల్వర్టును ఢీకొని 8 మందికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమమంగా ఉంది ఈ ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది.
రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన చిదుర సిద్దిరాములు కొడుకు చిదుర భరత్ వివాహం కామారెడ్డి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జరగనుంది. ఈ క్రమంలో పెళ్లికొడుకు తల్లిదండ్రులు, అతని సోదరి, ముగ్గురు చిన్నారులు కలిసి 8 మందితో కారులో ఫంక్షన్ హాలుకు బయలుదేరారు.
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ దాటిన తర్వాత వీరి కారు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుకాగా అందులో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆస్పత్రికి తరలింపు
స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. పెళ్లికొడుకు తల్లీదండ్రులు వినోద, సిద్ధిరాములుకు తీవ్ర గాయాలు అయ్యాయి. మేనత్త పరిస్థితి విషమంగా ఉంది. మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన కల్వర్టు పక్కనే ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. కల్వర్టును కాకుండా ట్రాన్స్ఫార్మర్ను ఢీకొని ఉంటే పెను ప్రమాదం సంభవించేదని స్థానికులు తెలిపారు.
