జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిబూడిదైంది.
ఈ ఘటన సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామ సమీపంలోని వంతెనపై మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కియా సెల్టోస్ కారు పద్మాజివాడి వంతెనపైకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది.
వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని, అవతలి వైపు నుంచి (హైదరాబాద్ వైపు) వస్తున్న కంటైనర్‌ను తాకింది. ఈ క్రమంలో కారు టైరు పేలిపోవడంతో రోడ్డుకు రాపిడి జరిగి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. క్షణాల్లోనే కారులో మంటలు వ్యాపించి వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది.
కారు నడుపుతున్న రాహుల్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు వ్యాపించకముందే అతను కారు నుంచి బయటపడటంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. స్వల్ప గాయాలైన రాహుల్‌ను వెంటనే అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రం ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు, స్థానికుల సహకారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
