మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కులమతాల కంటే అభివృద్ధి వైపే మొగ్గు చూపారని, అందుకే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా జిల్లాలో మెజార్టీ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి నిజామాబాద్ ఓటర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుమారు రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నిజామాబాద్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగిరిందని మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో జిల్లాలో అఖండ విజయం సాధించామని పేర్కొన్నారు. “ఒక సాధారణ కార్యకర్త మేయర్ కావడం కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని, పండ్లు అమ్ముకునే స్థాయి నుంచి నేడు మేయర్ పీఠాన్ని అధిష్టించిన ఉమారాణి గెలుపే దీనికి నిదర్శనం” అని ఆయన కొనియాడారు.
విభజన రాజకీయాలకు స్వస్తికులమతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వారికి పట్టణ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని విమర్శించారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ అభ్యర్థుల గెలుపుకు సోపానాలని అన్నారు. ఇంజనీరింగ్, వ్యవసాయ కళాశాలల ఏర్పాటుతో పాటు రూ. 680 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయని తెలిపారు.
అభివృద్ధి కోసమే ఎంఐఎం సహకారం
నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ఎంఐఎంతో కలయిక అవసరమని భావించినట్లు పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంపై పోటీ చేసి ఐదు సీట్లు గెలుచుకున్నామని, నగర ప్రగతి కోసం కలిసి ముందుకు సాగుతామని చెప్పారు.
కాగా, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం గమనార్హమన్నారు. కొన్ని చోట్ల ప్రతిపక్షాలు సెంటిమెంట్‌ను అస్త్రంగా చేసుకుని ప్రజలను ఉసిగొల్పడం వల్ల సుమారు 7 స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యామని విశ్లేషించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అయితే నగరం అన్ని రంగాల్లో అగ్రగామిగా మారుతుందని ప్రజలు ఆశీర్వదించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
