ఒక సామాన్య కార్యకర్తను మేయర్ పీఠంపై కూర్చోబెట్టడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి, నిజామాబాద్ ఎన్నికల ఇంచార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన బీసీ వర్గానికి చెందిన కూరగాయల ఉమారాణిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.”2005లో నిజామాబాద్ ఇంచార్జీగా ఉన్నప్పుడు మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకున్నాం..
మళ్లీ 20 ఏళ్ల తర్వాత అదే బాధ్యతతో వచ్చి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయడం గర్వంగా ఉంది” అని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ రెండేళ్ల ప్రజారంజక పాలనకు నిదర్శనమని, ఇవి కేవలం ఎన్నికలు కావని, ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇచ్చిన ‘రిఫరెండం’ అని ఆయన అభివర్ణించారు.
తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఆయన అభివర్ణించారు. ఆదిలాబాద్ నుంచి గద్వాల వరకు, పరిగి నుంచి కోదాడ వరకు రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కాంగ్రెస్ గెలుచుకుంది.
అలాగే ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ప్రజలు మాత్రం అభివృద్ధి వైపే నిలిచారని ఎద్దేవా చేశారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నామని వెల్లడించారు. సమస్యలు ప్రభుత్వ దృష్టికి వచ్చిన 24 గంటల్లోనే పరిష్కారం చూపుతున్నామని, గత పదేళ్ల పాలకులకు, తమకుఉన్న తేడా ఇదేనని అన్నారు.
నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి, నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులను యుద్ధప్రాతిపదికన చేపడతామన్నారు. 20, 21 ప్యాకేజీల పనులను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
జిల్లా నుంచి రికార్డు స్థాయిలో వరి సాగు, కొనుగోళ్లు కాంగ్రెస్ హయాంలోనే జరుగుతున్నాయని గుర్తుచేశారు. మతం పేరుతో సమాజాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకు తెలంగాణలో తావులేదని ఉత్తమ్ హెచ్చరించారు.
ఇతర రాష్ట్రాల్లో పారిన పప్పులు ఇక్కడ ఉడకవని ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారని అన్నారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సామాన్య కార్యకర్త కూరగాయల ఉమారాణిని మేయర్ పదవికి ఎన్నుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ కార్పొరేషన్లో తొలి పౌరురాలిగా బాధ్యతలు చేపట్టిన ఆమెను అభినందిస్తూ, నిజామాబాద్ ప్రజలకు ఆయన సెల్యూట్ చేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి, ఈ నగరాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామక్రిష్ణ, గడుగు గంగాధర్,తాహిర్ బిన్ హందాని, కేశ వేణు నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు
