నిజామాబాద్ జిల్లా కేంద్రాన్ని గత వారం రోజులుగా వణికించిన వరుస చైన్ స్నాచింగ్‌ల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పోలీసు కమిషనర్ (సిపి) ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన నిజామాబాద్ సబ్ డివిజన్ పోలీసులు..
ఓ అంతర్రాష్ట్ర పాత నేరస్థుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు సోమవారం నమ్మదగిన సమాచారంతో నిజామాబాద్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంబోలి ప్రాంతంలో నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం: జిల్లాలో వరుసగా జరుగుతున్న బంగారు గొలుసుల దొంగతనాలపై పోలీసు కమిషనర్ తీవ్రంగా స్పందించారు.
నిందితులను పట్టుకునేందుకు నిజామాబాద్ సబ్ డివిజన్ ఏసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిఘా పెట్టిన పోలీసులు.. పంబోలి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహారాష్ట్రకు చెందిన పాత నేరస్థుడు అమన్ హుస్సైన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
పోలీసుల విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించాడు. ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తాను వరుస నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల చేసిన దొంగతనాలకు సంబంధించి.. నిజామాబాద్ ఫోర్ టౌన్, త్రీ టౌన్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉంటూ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్నట్లు విచారణలో తేలింది.
నిజామాబాద్ జిల్లాలో దొంగిలించిన బంగారు ఆభరణాలను మహారాష్ట్రలోని నాందేడ్, బోకర్ ప్రాంతాల్లో విక్రయించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పట్టుబడిన నిందితుడిని మహారాష్ట్రలోని నాందేడ్ (మస్తాన్‌పురా, విష్ణునగర్) నివాసి, వృత్తిరీత్యా టైలర్‌గా పనిచేస్తున్న అమన్ హుస్సైన్ ఇక్బాల్ హుస్సైన్ అలియాస్ అమన్ పటేల్ (23)గా పోలీసులు గుర్తించారు.
నిందితుడిని ఈరోజు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిందితుడిని జైలుకు తరలించారు. దొంగిలించబడిన బంగారు సొత్తును రికవరీ చేసేందుకు పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.
