పేదల నోళ్లు కొట్టి ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న ముఠాలపై నిజామాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలో అక్రమంగా నిల్వ ఉంచిన, రవాణా అవుతున్న రేషన్ బియ్యంపై సోమవారం ‘చీతా ఫోర్స్’ సిబ్బంది మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 38 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగించిన ఒక అశోక్ లేలాండ్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా సాగుతుందన్న పక్కా సమాచారంతో జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, తీవ్రంగా స్పందించారు. సీపీ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ (ఇన్‌చార్జ్) మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్, స్థానిక పోలీసు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నగరంలోని మూడు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిలయన్స్ షాపింగ్ మాల్ ఎదురుగా రోడ్డుపై అనుమానాస్పదంగా వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని (TS 16 UC 8373) పోలీసులు ఆపి సోదా చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి నిర్ఘాంతపోయారు. దీంతో బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, తదుపరి చర్యల నిమిత్తం ఫోర్ టౌన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు. అలాగే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజాహిద్ నగర్ కాలనీలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
అబ్దుల్ అల్తాఫ్ అనే వ్యక్తి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు 6 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని సంబంధిత పోలీసులకు అప్పగించారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తహెద్ పుర కాలనీలో గల సయ్యద్ సాజిద్ అలీ నివాసంపై దాడి చేసి, రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.
- చట్టపరమైన చర్యలు తప్పవు:
- పేద ప్రజలకు ప్రభుత్వం అందజేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా, రవాణా చేసినా లేదా విక్రయించినా చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. పట్టుబడిన ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ కమిషనర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి
