ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6వ తేదీ (శుక్రవారం) జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. జిల్లా పర్యటనలో భాగంగా కేషాపూర్ వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభా ప్రాంగణం వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నారు.
ఈమేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా జిల్లాకు చేరుకుని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సుమారు 50 వేల మంది కార్యకర్తలు, ప్రజలు ఈ సభకు హాజరవుతారని కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
నిఘా నీడలో సభా ప్రాంగణం
ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఇంచార్జి మంత్రులు కూడా తరలివస్తుండటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1200 మంది పోలీసులతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, సీపీ సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. పార్కింగ్, తాగునీరు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాజకీయంగా కీలకం..
ఈ బహిరంగ సభ ద్వారా జిల్లాలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సీఎం రాకతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, ఈ పర్యటన రాజకీయంగా తమకు ఎంతగానో కలిసి వస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
