స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ఘోష్ కమిషన్ నివేదిక, సీబీఐ విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు దిగుతున్నదని సిర్పారాజు నిప్పులు చెరిగారు.
కావాలనే బీజేపీ, కాంగ్రెస్ కుమ్ముకై కేసీఆర్ పై కుట్రలు చేస్తున్నారని తెలిపారు. కాలేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా మంగళవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆదేశాల మేరకు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ సర్కారు నియమించిన ఘోష్ కమిషన్ బూటకమని, సీబీఐ విచారణ నాటకమని అన్నారు.
ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ డ్రామా చేస్తుందని దుయ్యబట్టారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు కమిషన్ నివేదిక, సీబీఐ విచారణ పేరిట హడావుడి చేస్తున్నారు. ఓట్ల కోసం ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారనీ ద్వజమెత్తారు.
ఇది కేసీఆర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర మాత్రమే కాదని, తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ కుట్ర జరుగుతున్నదని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పజెప్పడం అంటే ఆ ప్రాజెక్టును పూర్తిగా మూసేయడమేనని పేర్కొన్నారు. నిన్నటిదాకా సీబీఐ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట మార్చాడని పేర్కొన్నారు.
ఇది కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. కాళేశ్వరం కేసును కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఇచ్చినా, మరే ఏజెన్సీకి ఇచ్చినా భయపడేది లేదని సవాల్ చేశారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
