నగరంలోని లలిత మహల్ థియేటర్ సమీపంలో ఒక జింక డ్రైనేజీలో మృతి చెంది కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డ్రైనేజీలో జింక మృతదేహాన్ని గమనించిన కాలనీ వాసులు వెంటనే అటవీ శాఖ అధికారులకు స్థానిక ప్రతినిధులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని జింక మృతదేహాన్ని పరిశీలించారు. చనిపోయిన జింకకు సుమారు ఒక సంవత్సరం వయసు ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అసలు ఈ జింక నడిబొడ్డున ఉన్న నగరంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి చనిపోయిందా? లేక ఎవరైనా వేటాడి ఇక్కడ పడేశారా? అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై అటవీ అధికారులు స్పందిస్తూ… జింక మృతదేహానికి పంచనామా నిర్వహిస్తామని, అలాగే చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి వివరాలను సేకరిస్తామని తెలిపారు. స్పందించిన 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ విషయం తెలుసుకున్న 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులతో కాలనీ వాసులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.”నగర నడిబొడ్డున ఇలా జింక మృతి చెంది కనిపించడం ఆందోళనకరం. దీని వెనుక ఉన్న కారణాలపై అటవీ శాఖ అధికారులు సమగ్ర విచారణ జరపాలి.
సీసీ కెమెరాల ఆధారంగా నిజానిజాలు బయటకు తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని కార్పొరేటర్ ఎర్రం సుధీర్ డిమాండ్ చేశారు.
