పాఠశాలలో వడ్డించిన మధ్యాహ్న భోజనం విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. భోజనం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది.
మాల్ తుమ్మెద ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఎప్పటిలాగే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. అది తిన్న కొద్దిసేపటికే ఎనిమిది మంది విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకోవడం ప్రారంభించారు.
మరికొందరు కడుపునొప్పితో విలవిల్లాడటంతో పాఠశాల ఆవరణలో ఆందోళన నెలకొంది. విద్యార్థుల పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు వెంటనే స్పందించి, వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో విద్యార్థులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భోజనం వికటించడం వల్లే (ఫుడ్ పాయిజన్) అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.
