ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026కు నిజామాబాద్ నగరం వేదిక కానుంది. ఇందులో భాగంగా టేబుల్ టెన్నిస్ పోటీల నిర్వహణకు నవ్యభారతి గ్లోబల్ స్కూల్లోని ఖేల్ భారతి ఇండోర్ స్టేడియాన్ని ఎంపిక చేశారు.
ఈ విషయాన్ని పాఠశాల సీఈఓ కె. సంతోష్‌కుమార్ తెలిపారు.ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు తమ స్టేడియం ఎంపిక కావడం సంస్థతోపాటు నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు.
ఈ ఈవెంట్‌కు ఎంపికైన ఏకైక ప్రైవేట్ ఇండోర్ స్టేడియంగా ఖేల్ భారతి నిలిచిందని తెలిపారు. జాతీయ స్థాయి క్రీడాకారులకు ఆతిథ్యం ఇచ్చే స్థాయిలో తమ క్రీడా మౌలిక వసతులు అభివృద్ధి చెందడం ఆనందంగా ఉందన్నారు.
సుమారు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఖేల్ భారతి ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించినట్లు సంతోష్‌కుమార్ వివరించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఎయిర్ రైఫిల్, పిస్టల్ షూటింగ్, చెస్, క్యారమ్, ఫిట్నెస్, స్ట్రెంగ్త్ కండిషనింగ్ తదితర క్రీడలకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
సుమారు 500 మంది ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీతోపాటు బాలురు, బాలికలకు ప్రత్యేక వాష్‌రూమ్‌లు, చేంజింగ్ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. సర్టిఫైడ్ కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు యువ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
ఖేలో ఇండియా పోటీలకు అత్యుత్తమ సౌకర్యాలు, క్రీడాకారులకు అవసరమైన వసతి, ఆతిథ్య ఏర్పాట్లు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ పోటీలు జిల్లాలో క్రీడాభివృద్ధికి మరింత ఊతమివ్వడంతోపాటు విద్యార్థులను క్రీడల వైపు ఆకర్షిస్తాయని సంతోష్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
