గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు కలిగిన అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.
ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటి విడతలో ఈ మండలానికి ఈ నెల 11న పోలింగ్ ప్రక్రియ జరుగనుండగా, నామినేషన్ల స్వీకరణ నుండి మొదలుకుని ఇప్పటివరకు పూర్తి చేసిన ప్రక్రియలు నిబంధనలకు అనుగుణంగా జరిగాయా, పోలింగ్ నిర్వహణ కోసం చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ ఎం.పీ.డీ.ఓ, తహసిల్దార్ ఇతర అధికారులతో సమీక్ష జరిపారు.
ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఓటింగ్ కు అవసరమైన ఎన్నికల సామాగ్రి సిద్ధంగా ఉండాలన్నారు.
బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మెటీరియల్, ఎన్నికల సిబ్బంది, జోనల్ అధికారుల నియామకం తదితర ఏర్పాట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న వారితో పాటు, భద్రతా బలగాలలో కొనసాగుతున్న సర్వీస్ ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునేలా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి ఉంటుందన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం మార్గదర్శకాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. సమీక్షలో ఎం.పీ.డీ.ఓ శంకర్, తహసిల్దార్ దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.
