స్థానిక రామకృష్ణ ధ్యాన మందిరంలో శుక్రవారం సంస్కార భారతి సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి రాజకుమార్ సుబేదార్ అధ్యక్షత వహించగా, సంస్కార భారతి తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి నిరంజన్ మార్గనిర్దేశం చేశారు. సంస్థ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సంస్థ కార్యదర్శిగా ఎస్.మాధురి, మాతృశక్తి కన్వీనర్‌గా వరలక్ష్మి, ఉపాధ్యక్షులుగా మాధవి, నాగనాథ్ గుప్త, దృశ్యకళా ప్రముఖ్‌గా సాయిరెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ.. భారతీయ కళలు, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణలో సంస్కార భారతి కృషి అభినందనీయమని, నూతన బాధ్యులు సంస్థాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బంకించంద్ర ఛటర్జీ ‘వందేమాతర’ గీతాన్ని రచించి 150 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని తీర్మానించారు.
అలాగే, గురు పౌర్ణమి పురస్కరించుకుని నటరాజ పూజోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో నగర కన్వీనర్ ఎన్.శంకర్, బి.మల్లేష్, జి.ప్రసాద్, సిహెచ్.శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, రాధాకృష్ణ, బి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
