ప్రభుత్వ భూములే లక్ష్యంగా సాగుతున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ యంత్రాంగం కొరడా ఝుళిపించారు. నగరంలోని 8వ డివిజన్ పరిధిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను శుక్రవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ స్వయంగా పర్యవేక్షించి, జేసీబీలతో కూల్చివేయించారు.
8వ డివిజన్ పరిధిలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందంటూ స్థానిక కార్పొరేటర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ‘ఇది సంగతి’ పత్రికలో ప్రచురితమైన కథనం క్షేత్రస్థాయిలో సంచలనం సృష్టించింది. సదరు కథనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్ దిలీప్ కుమార్, వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలను గుర్తించాలని ఆదేశించారు.
కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది, శుక్రవారం ఉదయమే భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ, “అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు.
ప్రభుత్వ భూములు సామాన్య ప్రజల ఆస్తి. వీటిని కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ యంత్రాంగంపై ఉంది. అక్రమ నిర్మాణాలు చేపట్టే వారు వెంటనే ఆ పనులను నిలిపివేయాలి. లేనిపక్షంలో కూల్చివేతలతో పాటు, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని ఘాటుగా హెచ్చరించారు.
ఈ కూల్చివేత చర్యతో 8వ డివిజన్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ విషయంలో మున్సిపల్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించడాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
