Friday, April 17, 2026
HomePOLITICAL NEWSUncategorizedరైతు ఉద్యమాల అడ్డ... ఆర్మూర్ గడ్డ- రుణమాఫీ పై రైతన్నల పోరుబాట- రేపు ఆర్మూర్ లో...

రైతు ఉద్యమాల అడ్డ… ఆర్మూర్ గడ్డ- రుణమాఫీ పై రైతన్నల పోరుబాట- రేపు ఆర్మూర్ లో చేపట్టనున్న మహాధర్నా

మూడు నియోజకవర్గాల రైతులతో ఏర్పడిన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ – నాడు పసుపు బోర్డు, ఎర్రజొన్నల మద్దతు కోసం ఉద్యమం – నేడు రుణమాఫీ పై ఉద్యమించనున్న రైతులు

రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచిన ఆర్మూర్ డివిజన్ రైతులు మరోసారి సర్కారుపై నిరసన గళం విప్పేందుకు పోరుబాటకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలపై ఆర్మూరు గడ్డపై ఉన్న రైతులు మొట్టమొదటిగా ఉద్యమిస్తూ జంగుకు సై అంటారు. ప్రభుత్వాలు ఏవైనా… పాలకులు ఎవరైనా తమదంత రైతు పార్టీ అంటూ ఆకుపచ్చ కండువా వేసుకొని ఒక్కటై వెనుకడుగు వేయరు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్ర జొన్నల మద్దతు ధర కోసం పార్టీలకు అతీతంగా రైతులంతా ఒక్కటై… ఉద్యమించారు.

శాంతియుతంగా తమ నిరసనను తెలుపుదామనుకొని ఆర్మూర్ కు చేరుకుంటే… అది కాస్త ఘర్షణకు దారి తీసి ఉద్రిక్త వాతావరణం నెలకొనేలా చేసింది. ఏకంగా శాంతిభద్రతలను అదుపు చేసేందుకు ఎర్రోజోన్న రైతులపై పోలీసులు బుల్లెట్ల వర్షం కురిపించారు.

దీంతో ఉద్రిక్తులైన రైతన్నలు ఎర్రజొన్న వ్యాపారుల ఇండ్లను తగలబెట్టడమే కాకుండా వాహనాలను సైతం నిప్పట్టించారు.

ఆనాడు తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్న కెసిఆర్ రైతులకు సంఘీభావంగా తరలివచ్చారు. రైతు నాయకుడిగా ఉన్న దివంగత వేముల సురేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, బిజెపి నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ లతోపాటు అనేకమంది నాయకులు ఈ ఉద్యమానికి ఊపందించారు.

ఈ సంఘటన ఆనాడు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలుతున్న పాలకులను అతలాకుతలం చేసింది. శాంతియుత విధానంలో రైతులు నిరసన వ్యక్తం చేయడానికి రోడ్డు ఎక్కితే వారిపై ఉక్కుపాదం మోపుదాం అనుకున్న పాలకులకు చుక్కలు చూపించారు ఆర్మూర్ రైతులు.

నేడు మరో మారు ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుపై సమరం చేసేందుకు రేపు ఆర్మూర్ లో మహాధర్నా కు సిద్ధమవుతున్నారు.

అసెంబ్లీ సమరంలో ప్రతి రైతుకు షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది.

అయితే ఎన్నికలు పూర్తయి 8 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు హామీలు ఒక్కటి ఒక్కటిగా నెరవేరుస్తున్నప్పటికిని, రైతు రుణమాఫీ విషయంలో నెలకొన్న అయోమయం రైతులను ఆగ్రహానికి గురిచేస్తుంది,

ఆగస్టు 15 లోపు మూడు విడతల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికిని రుణమాఫీకి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు వర్తించకపోవడంతో అర్హులైన వారికే రుణమాఫీ చేశామని అధికారులు చెబుతున్న,

రైతుబంధుకు లేని ఆంక్షలు రైతు రుణమాఫీ ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో అనేకమంది రైతులకు నిబంధనల మాటున రుణమాఫీకి అర్హులు కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు ప్రభుత్వ తీరుపై గుస్సుమంటున్నారు.

ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆయా స్థలాల్లో ప్రారంభమైన రైతుల ఆందోళన చిలికి చిలికి గాలి వానగా మారుతుంది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు రైతులకు మద్దతు తెలుపుతూ నిరసన తెలియజేస్తూ ఉంటే…

మరోపక్క రైతులంతా ఒక్కటై రైతు కార్యాచరణ కమిటీ పేరుతో రేపు ఆర్మూర్ లో మూడు నియోజకవర్గాలైన ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గ రైతాంగం పెద్ద ఎత్తున శాంతియుత నిరసన తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు.

గతంలో ఎర్ర జొన్న మద్దతు ధర కోసం ఉద్యమించి తూటాలకు ఎదురు నిలిచిన రైతాంగ స్పూర్తిని నిలిపిన ఆర్మూర్ ప్రాంత రైతులు… మరో మారు కాంగ్రెస్ సర్కార్ పై పోరుబాటకు సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేయకుంటే మహా ధర్నా చేసి తీరుతామని రైతు ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు అంటున్నారు.

రుణమాఫీ వర్తించిన రైతుల కంటే రుణమాఫీ వర్తించని రైతుల సంఖ్య వేళల్లో ఉండడంతో ఇంటికి ఇద్దరు చొప్పున రైతులు ఆర్మూర్ కు తరలిరావడానికి సిద్దం అవుతున్నారు.

శాంతియుత నిరసన తెలిపేందుకు వస్తున్న రైతులకు స్వేచ్ఛయుత వాతావరణం కల్పిస్తే గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

లేనియెడల కాంగ్రెస్ సర్కార్ ఇరకాటంలో పడక తప్పదు అనేది జగమెరిగిన వాస్తవం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!