జిల్లాలో పెరిగిపోతున్న జ్వరాలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దోమకాటు వ్యాధులు విజృంభించడంతో జ్వరబాధితులు వణికిపోతున్నారు.
గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా జ్వరాల బారిన పడ్డ ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. జిల్లా లో డెంగ్యూ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరు గుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
సీజనల్ వైరల్ కేసులతో పాటు, టైఫాయిడ్, డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. కేవలం గడిచిన ఇరవై నాలుగు గంటలో 11 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.అలాగే ఆగస్టు నెలలో 308 డెంగ్యూ కేసులు నమోదు అయినట్లు తెలిపారు.
జిల్లాలో, పలు మండలాలు, గ్రామాల్లో జ్వరాల బారినపడ్డ వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది.
కాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల వివరాలు నమోదు అవుతున్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రు ల్లో చేరుతున్న రోగుల వివరాలు ప్రభుత్వ లెక్కలకు అందడం లేదు.
జిల్లాలో ఏ ప్రైవేటు ఆసుపత్రి చూసినా రోగులు పెద్ద సంఖ్యలో కనబడుతున్నారు. ఇదే అదునుగా కొందరు ప్రైవేటు యాజమాన్యాలు అందినకాడికి దోచుకుంటున్నారు.
పేద,మధ్యతరగతి ప్రజలు తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తూవేల రూపాయలు ఫీజులు కడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు.
దోమల నియంత్రణపై అధికారులకు ముందుచూపు?వానాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతున్న దోమల నియంత్రణపై అధికారులకు ముందుచూపు లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించి ఇంటి పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని డ్రై చేస్తూ దోమల వృద్ధిని అరికట్టాల్సిన అవసరం ఉంది. కానీ అధికారులు నామమాత్రంగా డ్రైడేను నిర్వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఆప్రమత్తంగానే ఉన్నామని వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నా జిల్లాలో జ్వరాల కేసులు పెరిగిపోవడం ఆందో ళన కలిగిస్తోంది.
తీవ్రమైనజ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న వారంతా డెంగ్యూ పాజిటివ్ అనే అనుమానంతో ఆసుపత్రుల్లో చేరిపోతున్నారు.