చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై ఉక్కుపాదం మోపుతామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు.
సంక్రాంతి పండుగ వేళ జిల్లా వ్యాప్తంగా కోడిపందాలు, అలాగే పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధమైందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణా, జూదం పెచ్చరిల్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద నిరంతర వాహన తనిఖీలు ఉంటాయని తెలిపారు. అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ముమ్మరం. సరిహద్దు అధికారులకు కచ్చితమైన ఆదేశాల జారీ చేశారు.
చట్టాన్ని అతిక్రమించి జూద కేంద్రాలు నడిపినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కటకటాల వెనక్కి నెట్టడం ఖాయం” అని సీపీ హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలోని అధికారులందరికీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామని, నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.
మీ పరిసరాల్లో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని కమిషనర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
