వినాయక చవితి వేళ గణేశుడి విగ్రహ ప్రతిష్ఠ విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంతో పూజలు, నవరాత్రి ఉత్సవాలు నిర్వహించకుండానే విగ్రహాన్ని నిమజ్జనం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని పీర్జాపూర్‌లో చోటుచేసుకుంది.
పీర్జాపూర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే విషయంలో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో చౌదరిగూడ పోలీసులు జోక్యం చేసుకున్నారు.
ఆలయంలో ఏ వర్గం కూడా గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదని ఇరువర్గాలకు సూచించినట్లు తెలిసింది.ఈ నేపథ్యంలో ఇరువర్గాలు తాము తీసుకొచ్చిన గణేశుడి విగ్రహాలకు పూజలు నిర్వహించకుండానే నిమజ్జనం చేశారు.
వినాయక చవితి రోజునే పూజలు లేకుండా విగ్రహాలను నిమజ్జనం చేయాల్సి రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. దేవుడి విగ్రహం ప్రతిష్ఠ విషయంలోనూ వర్గ విభేదాలు తలెత్తడంపై పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు.
