జార్ఖండ్ నుంచి రైలులో గంజాయిని హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ చార్మినార్ జోన్, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 3.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన ఇంజమాముల్ హక్, అనీష్‌కుమార్ షా కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. కొంపల్లిలో నివాసం ఉంటూ క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నారు. జార్ఖండ్ నుంచి రైలు మార్గంలో గంజాయిని తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు.
వారి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.80 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
