అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా డాక్టర్ నాగమోహన్ ఏర్పాట్లుతెలంగాణలో ప్రభుత్వ వైద్యుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో పారదర్శకతను కోరుతూ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మెతో ప్రభుత్వ ఆసుపత్రులు స్తంభించిపోయాయి.
బదిలీల ప్రక్రియలో జీవో నెం. 38 నిబంధనలను యథాతథంగా అమలు చేయాలని, ఎవ్వరూ జోక్యం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ వైద్యులు నిరసన బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులు శుక్రవారం సాధారణ అవుట్ పేషెంట్ సేవలను బహిష్కరించారు.
బదిలీల ప్రక్రియలో జరుగుతున్న జాప్యం, రాజకీయ ఒత్తిళ్ల వల్ల సీనియర్ వైద్యులకు అన్యాయం జరుగుతోందని సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకేచోట పనిచేసుకునే అవకాశం కల్పించే ‘స్పౌజ్’ కేటగిరీని పక్కనపెట్టడంపై వైద్య వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.
అవినీతికి ఆస్కారం లేకుండా జీవో 38 ప్రకారం నిబంధనలను అమలు చేయాలని వారు పట్టుబడుతున్నారు. సమ్మె ప్రభావంతో ఓపీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే, రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. సమ్మెలో వైద్యులు పాల్గొన్నా, అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆయన పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం జూనియర్ డాక్టర్ల సహాయంతో ఓపీ సేవలను కొనసాగిస్తున్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి, వైద్యుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, పారదర్శకమైన బదిలీల ప్రక్రియను చేపట్టాలని టీజీడీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
