నగరంలో శాంతి భద్రతల పరిరక్షణే తన ప్రథమ ప్రాధాన్యత అని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం యాదగిరి గౌడ్ స్పష్టం చేశారు.
బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ముఖ్యంగా మట్కా, జూదం వంటి దురలవాట్లు, రేషన్ బియ్యం (పి.డి.ఎస్) అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, రౌడీ షీటర్లు మళ్లీ పాత పద్ధతుల్లో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతామని, వారు తమ ప్రవర్తన మార్చుకోకపోతే వారిపై ‘పి.డి. యాక్ట్’ నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.నగర ప్రజలు ఎటువంటి భయం లేకుండా పోలీసులకు సహకరించాలని ఎస్.హెచ్.ఓ కోరారు.
సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, నేరాల నియంత్రణలో పోలీసులకు సమాచారం అందించే ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
