పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ కొండంత అండగా నిలుస్తోందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
సోమవారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 324 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌తో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, పేదలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని 194 మందికి షాదీ ముబారక్ కింద రూ. 1,94,22,504, 130 మందికి కల్యాణలక్ష్మి కింద రూ. 1,30,15,080 కలిపి మొత్తం రూ. 3,24,37,584 విలువైన చెక్కులను అందజేశామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే కీలక హామీలను నెరవేర్చిందని ఆయన గుర్తు చేశారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు ఇప్పటికే నిరంతరాయంగా సాగుతున్నాయని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, యువతకు ఉద్యోగాల కల్పన, సన్నబియ్యం పంపిణీ ద్వారా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, నుడా చైర్మన్ కేశ వేణు, స్థానిక కార్పొరేటర్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
