నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, అత్యంత కఠినమైన నిష్టతో నిర్వహించిన రంజాన్ ఉపవాస దీక్షలు (రోజా) శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు.
నిజామాబాద్ నగరంతో పాటు బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, డిచ్‌పల్లి తదితర ప్రాంతాల్లోని ఈద్గాల వద్ద ముస్లింలు భారీ సంఖ్యలో చేరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శనివారం ఉదయాన్నే నూతన వస్త్రాలు ధరించి ఈద్గాలకు తరలివెళ్లారు.
అల్లా నామస్మరణతో నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్,ఖిల్లా ఈద్గా, అర్సపల్లి, వినాయక్ నగర్ మసీదులు ప్రతిధ్వనించాయి. మత పెద్దల (మౌలానా) నేతృత్వంలో ఈద్-ఉల్-ఫితర్ నమాజ్‌ను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ తెలుపుకున్నారు.
చిన్నపిల్లలు సైతం కొత్త బట్టలు వేసుకుని ఉత్సాహంగా పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. హిందూ-ముస్లిం సోదరభావానికి ప్రతీకగా పలుచోట్ల ఇతర మతాల వారు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం. సరిహద్దు పట్టణమైన బోధన్, ఆర్మూర్ పట్టణంలో రాజకీయ నాయకులు, ప్రముఖులు ముస్లిం సోదరులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పండుగ పూట పేదలకు ‘జకాత్’, ‘ఫిత్రా’ రూపంలో నగదు, వస్త్రాలు, తోఫాలను పంపిణీ చేసి ముస్లింలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
పోలీసుల భారీ బందోబస్తు:
ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా సీపీ సాయి చైతన్య నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ట్రాఫిక్ మళ్లింపులు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.
మున్సిపల్ యంత్రాంగం పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యాలను పర్యవేక్షించింది. జిల్లావ్యాప్తంగా రంజాన్ పండుగ ప్రశాంత వాతావరణంలో, అత్యంత సంబరంగా ముగిసింది.
