హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలో వీరహనుమాన్ విజయ యాత్ర వైభవంగా ప్రారంభమైంది.ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఆంజనేయుడు, శ్రీరాముడు, శివుడు, దత్తాత్రేయుడు, భారతమాత, ఛత్రపతి శివాజీ తదితర ప్రతిమలను ఊరేగించారు.
ఉదయం 10.40 గంటలకు కంఠేశ్వరాలయం వద్ద ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు, సీపీ సాయి చైతన్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.ఆర్యసమాజ్ నిర్వాహకులు సంచార వాహనంలో హోమం చేశారు.శోభాయాత్రలో హిందూ సంఘాల నాయకులు, యువకులు ఎంతో ఉత్సాహంగా అడుగడుగునా అంజనీపుత్రుడి కీర్తనలే
జైశ్రీరాం..
రాంలఖన్ జానకీ..
జై బోలో హనుమాన్కీ బజరంగబళీ
అంటూ పెద్ద పెద్ద నినాదాలతో నృత్యాలు చేస్తూ, అంజన్న నామస్మరణతో ఇందూరు మారుమోగుతుంది. ఈ శోభాయాత్ర సుభాష్నగర్, హమాల్వాడి, నాందేవ్వాడ మీదుగా ఈ శోభాయాత్ర కొనసాగుతోంది.ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ..
ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య శ్రీరాముడి ఆశీస్సులతో భవిష్యత్తులో తెలంగాణలో రామరాజ్య స్థాపన జరగాలని అంజన్న స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు.
ఇందూరు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు.అలాగే జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ..హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
హనుమాన్ జయంతి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. జిల్లాలో మొత్తం 34 ర్యాలీలు ఉన్నాయని అందుకోసం ప్రత్యేకంగా 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.
