మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ధ్వజంకాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల హర్షించారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ తీర్పుతో న్యాయం గెలిచిందని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులపై ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యలకు అడ్డుకట్ట పడిందని పేర్కొన్నారు. కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని హైకోర్టు స్పష్టం చేయడాన్ని గణేష్ బిగాల గుర్తు చేశారు.
“సెక్షన్-8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలకం. ప్రాథమిక సూత్రాలు పాటించని పక్షంలో ఆ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత ఉండదని తేలిపోయింది” అని ఆయన అన్నారు.
తెలంగాణ జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై, కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కక్షపూరితంగా వ్యవహరించాయని ఆయన విమర్శించారు. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా రెండేళ్ల పాటు జాప్యం చేసి, ఇప్పుడు గత్యంతరం లేక పనులు మొదలుపెట్టారని మండిపడ్డారు.
కేసీఆర్ గారిపై చేసినవన్నీ నిరాధార ఆరోపణలేనని ఈ తీర్పుతో నిరూపితమైందని, ఇప్పటికైనా విపక్షాలకు కనువిప్పు కలగాలని సూచించారు. రాజకీయ వేధింపులు, కమిషన్ల పేరుతో కాలయాపన చేయడం మానేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని గణేష్ బిగాల హితవు పలికారు.
న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకానికి ఈ తీర్పు ఒక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, గాండ్ల లింగం, మతీన్ తదితరులు పాల్గొన్నారు.
