రంగంలోకి 200 అద్దె బస్సులునేటి నుంచి నిరవధిక దీక్షలకు కార్మిక సంఘాల పిలుపు..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మిక సంఘాలు నిరవధిక దీక్షలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ప్రయాణికులకు రవాణా కష్టాలు కలగకుండా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 645 బస్సుల సర్వీసులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దీకి అనుగుణంగా అద్దె బస్సులను రోడ్లపైకి తెచ్చారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లను గుర్తించిన అధికారులు, సుమారు 200 అద్దె బస్సులను ప్రత్యామ్నాయంగా నడుపుతున్నారు.
ముఖ్యంగా ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ అధికారులు బస్టాండ్ల వద్దే ఉండి రద్దీని బట్టి బస్సులను పంపిస్తున్నారు. సాధారణం కంటే ఎక్కువ ట్రిప్పులు వేయాలని డ్రైవర్లకు సూచించారు.
కార్మిక సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్టీసీ యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. పోలీసుల పహారాలో బస్సులను నడిపిస్తున్నారు. బస్టాండ్లు, డిపోల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేట్ డ్రైవర్ల సహాయంతో బస్సులను నడుపుతూ రవాణా వ్యవస్థ స్తంభించకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు తమ డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాలు పోరుబాట పట్టాయి. ఈ రోజు నుండి నిరవధిక దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి.
దీంతో జిల్లాలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ, పూర్తిస్థాయి సర్వీసులు నడవకపోవడంతో ప్రయాణికులు కొంత మేర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికులు విధులకు దూరం కావడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు.
