నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు అవసరం ఉంటే సూచనలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రాజకీయ పార్టీలను కోరారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ పట్టణాల పరిధిలో ముసాయిదా ఓటరు జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే గత డిసెంబర్ 31న డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసి, అన్ని మున్సిపాలిటీల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు జరిపారని గుర్తు చేశారు.
వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, వాటిని పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇంకనూ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, తుది జాబితాను వెలువరించకముందే గడువు లోపు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేయాల్సిన వాటిని తగిన ఆధారాలు పరిశీలించి తప్పనిసరిగా సవరిస్తామని, ఈ విషయంలో రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని కోరారు.
ఓటరు జాబితాలో డూప్లికేషన్ లేకుండా, ఇతర వార్డుల పరిధిలో ఉన్న ఓటర్లను వారు నివసిస్తున్న వార్డు పరిధిలోని ఓటరు జాబితాలోకి చేర్చడం, కుటుంబ సభ్యులైన ఓటర్లు అందరూ సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ముసాయిదా జాబితాలో ఎక్కడైనా మరణించిన వారి ఓట్లు, రెండు చోట్ల నమోదైన ఓట్ల సమాచారం తెలిస్తే, తగిన ఆధారాలతో వివరాలు అందించాలని, వాటిని తప్పనిసరిగా తొలగిస్తామని అన్నారు. అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించి, వాటిని పరిష్కరించిన మీదట ఈ నెల 10న తుది ఓటరు జాబితాను వెలువరించడం జరుగుతుందన్నారు.
డివిజన్లు, వార్డుల పరిధి యధాతధంగా ఉంటుందని, వాటి పరిధిని మార్చే అవకాశం ఎంతమాత్రం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కాగా, ఎక్కడైనా ప్రహరీ గోడ లేకుండా, సరైన భద్రత, కనీస వసతులు లేని పోలింగ్ కేంద్రాలు ఉంటే, క్షేత్రస్థాయిలో పరిశీలించి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమ్మతితో అవసరమైన పక్షంలో వాటిని మరో చోటికి మార్చడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాలవియా, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, మున్సిపల్ కమిషనర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
