Sunday, April 26, 2026
HomeHEALTHఇందూరులో.. ‘దోమ’కాటు!..మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం.. పెచ్చరిల్లుతున్న దోమల బెడద...ఫాగింగ్‌కు ‘బ్రేక్’.. యాంటీ లార్వాకు ‘చావుదెబ్బ’...పగలు ఉక్కపోత.....

ఇందూరులో.. ‘దోమ’కాటు!..మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం.. పెచ్చరిల్లుతున్న దోమల బెడద…ఫాగింగ్‌కు ‘బ్రేక్’.. యాంటీ లార్వాకు ‘చావుదెబ్బ’…పగలు ఉక్కపోత.. రాత్రి రొదతో ప్రజల విలవిల…స్తంభించిన పారిశుధ్యం.. రోగాల గుప్పిట్లో నగరం!

నిజామాబాద్ నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఒకవైపు భానుడి భగభగలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు సూర్యుడు అస్తమించగానే మొదలవుతున్న దోమల దండయాత్ర ప్రజలను బెంబేలెత్తిస్తోంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.

మురుగు కాల్వల నిర్వహణ లోపం, నిలిచిపోయిన ఫాగింగ్ చర్యలు నగరవాసుల పాలిట శాపంగా మారాయి. నగరంలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా గల్లీల్లోని మురుగు కాల్వలు పూడికతో నిండిపోయి ఉండటంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి.

నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్, ఖలీల్‌వాడి, కంటేశ్వర్, ఆర్మూర్ రోడ్, బోధన్ రోడ్ పరిసరాల్లోని కాలనీల్లో దోమల మోత మామూలుగా లేదు. కాల్వల్లో యాంటీ లార్వా ద్రావణాన్ని చల్లాల్సిన సిబ్బంది ఎక్కడా కనిపించడం లేదని, బ్లీచింగ్ పౌడర్ ఊసే లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దోమల నివారణకు ప్రధాన అస్త్రమైన ఫాగింగ్ ప్రక్రియ నగరంలో నామమాత్రంగా కూడా జరగడం లేదు. కార్పొరేషన్ వద్ద ఉన్న ఫాగింగ్ యంత్రాలు మూలకు చేరాయా లేక ఆయిల్ ఖర్చుల పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా మురికివాడల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నా, వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.

కోట్లాది రూపాయల బడ్జెట్ ఉన్నా, నగరవాసుల ప్రాథమిక సమస్యల పరిష్కారంలో కార్పొరేషన్ విఫలమవుతోంది. మున్సిపల్ కమిషనర్ మొదలుకొని గ్రౌండ్ లెవల్ సిబ్బంది వరకు ఎవరూ పారిశుధ్యంపై దృష్టి పెట్టడం లేదు.

“ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.. కనీసం దోమల మందు కూడా కొట్టడం లేదు” అని నగర నివాసులు వాపోతున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రతతో పాటు గాలిలో తేమ పెరగడం దోమల పెరుగుదలకు కారణమవుతోంది.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మొద్దునిద్ర వీడి, ప్రతి డివిజన్‌లో ముమ్మరంగా ఫాగింగ్ చేయించాలని, మురుగు కాల్వల్లో గుర్రపుడెక్కను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!