ఆర్మూర్ పట్టణంలో జీవన్ మాల్ వద్ద నెలకొన్న ఉత్కంఠ
న్యాయం గెలిచింది అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
వారం గడువులోగా రెండు కోట్ల 52 లక్ష్యం చెల్లించాలని అధికారుల వెల్లడి
వ్యాపారం వాణిజ్య సముదాయాలకు హైకోర్టులో లభించిన ఊరట
జాన రమేష్ : ఇది సంగతి :
ఆర్మూర్ ; గతవారం కిందట ఆర్మూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన జీవన్ మాల్ సీజ్ చేసిన ఆర్టీసీ అధికారులు హైకోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి ప్రారంభించారు. దీంతో జీవన్ మాల్ వద్ద రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. విశ్వజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి నుండి ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు చెల్లించని కారణంగా ఈనెల 16వ తేదీన జీవన్ మాల్ ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు.
తమకు చెల్లించవలసిన మూడు కోట్ల 14 లక్షల రూపాయల బకాయిల చెల్లింపు విషయమై మాల్ ను స్వాధీన పరుచుకున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అయితే ఆర్టీసీకి చెల్లించవలసిన బకాయిలను తాను సక్రమంగానే చెల్లిస్తున్నానని, ఇంకా చెల్లించవలసిన మిగిలి ఉన్న బకాయిలను చెల్లిస్తానని, చెల్లించిన డబ్బులు విషయంలో ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ పై తీవ్రస్థాయిలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు.
అనంతరం తమకు న్యాయం కావాలని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో పాటు మాల్ లోని దుకాణదారులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు లో జీవన్ మాల్ ను తెరవాలని వీరికి అనుకూలంగా ఉత్తర్వులు వెలువడటంతో ఆర్మూర్ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు భద్రత ఏర్పాట్ల మధ్య ఆర్టీసీ అధికారులు వేసిన సీజును తొలగించి తిరిగి వ్యాపార వాణిజ్య సముదాయాలను ప్రారంభించారు.
అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీకి చెల్లించవలసిన రెండు కోట్ల 52 లక్షల రూపాయలను వారం రోజుల గడువు లోపట చెల్లించాలని లేనియెడల తిరిగి ఆర్టీసీ స్వాధీనం చేసుకుంటుందని వ్యాపార వాణిజ్య సముదాయాల అభ్యర్థన మేరకు హైకోర్టు సూచనల తో తిరిగి మాల్ సీజ్ ను తొలగించినట్లు వివరించారు.






