కామారెడ్డి జిల్లా కేంద్రంలో తొమ్మిది రోజుల క్రితం మిస్సైన ఇద్దరు చిన్నారులు ఓ బావిలో శవాలై కనబడ్డారు. కామారెడ్డి గోసంగి కాలనీకి చెందిన విజయ్ (10), సింహాద్రి(9)లు ఇంటి బయట ఆడుకుంటామని చెప్పి అదృశ్యమయ్యారు.
వీరు ఇరువురు అన్న చెల్లెలి కుమారులు వరుసకు బావ బామ్మర్దులు అవుతారు.. ఎప్పటిలాగానే ఆడుకుంటామని బయటకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు కనిపించలేదు.. దీంతో తల్లిదండ్రులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. తొమ్మిది రోజులుగా తమ కుమారులు ఎక్కడున్నా పోలీసులు తీసుకువస్తారని ఆశగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు నిరాశ ఎదురయింది.
స్థానిక రాజా నగర్ కాలనీల శివారులో పాడుబడ్డ బావిలో శవాలుగా ఇద్దరు చిన్నారులు కనిపించారు. వీరిద్దరూ చాపలు పట్టాలని బావి వద్దకు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు మృతి చెందారని పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి తెలిపారు. కేసు నమోదు చేసుకున్నామని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కామారెడ్డి ఏరియా ఆసుపత్రి కి తరలిస్తున్నట్లు తెలిపారు.
