ఇందల్వాయి మండలం గౌరారం పంచాయతీ పరిధిలోని లింగాపూర్‌లో సంచలనం సృష్టించిన ఇమ్మడి గోపి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మేనమామపై కక్ష పెంచుకున్న మేనల్లుడు, తన స్నేహితులతో కలిసి పక్కా పథకం ప్రకారం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ బి. ప్రకాష్ శనివారం వెల్లడించారు. లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు దగ్గి సతీష్‌కు తన మేనమామ ఇమ్మడి గోపితో గత కొంతకాలంగా భూమి, కుటుంబ రాజకీయ పరమైన విభేదాలు ఉన్నాయన్నారు.
గోపి తనను ఇబ్బంది పెడుతున్నాడన్న కోపంతో అతడిని హతమార్చాలని సతీష్ నిర్ణయించుకున్నాడన్నారు. ఈ క్రమంలో తన స్నేహితులైన కొండ శ్రీధర్, రవికుమార్, బండోళ్ళ దేవేందర్, అల్లకొండ నర్సయ్య, కోమన్‌పల్లి ప్రశాంత్‌లతో కలిసి పథకం వేశాడు.
అలాగే మరో నిందితుడు చిన్నరెడ్డి సంతోష్ రెడ్డి సహాయం కూడా కోరాడు.ఈ నెల 11న రాత్రి సమయంలో గౌరారం నుంచి లింగాపూర్ వైపు గోపి తన బ్రెజ్జా కారులో వస్తుండగా, నిందితులు అదును కోసం వేచి చూశారు. సతీష్ తన ఎంజీ హెక్టార్ కారుతో గోపి కారును బలంగా ఢీకొట్టాడనీ తెలిపారు.
ప్రమాదం జరిగిందని భావించి గోపి కారు దిగి పారిపోయే ప్రయత్నం చేయగా, నిందితులు చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారను పేర్కొన్నారు.శనివారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, నిజామాబాద్ వైపు కారులో వెళ్తున్న నిందితులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారనీ అన్నారు.
అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నామని తెలిపారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారనీ తెలిపారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కమ్మ కత్తి, రక్తపు మరకలున్న దుస్తులు, 7 సెల్ఫోన్లు, ఒక స్ప్లెండర్ బైక్ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ దర్యాప్తులో డిచ్పల్లి సీఐ కె. వినోద్, ఇందల్వాయి ఎస్ఐ జి. సందీప్ పాల్గొన్నారు.
