గత కొంతకాలంగా మౌనంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ ఖిల్లా రామాలయం వేదికగా ఆమె రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆధ్యాత్మిక కార్యక్రమాల సాక్షిగా తన రాజకీయ పునఃప్రవేశానికి ఆమె ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.రానున్న శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనేందుకు కవిత నిజామాబాద్‌కు రానున్నారు. నగరంలోని చారిత్రాత్మక ఖిల్లా రామాలయంలో నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. అయితే ఈ పర్యటన కేవలం దైవ దర్శనానికే పరిమితం కాదని, అదే వేదికగా తన రాజకీయ పంథాను స్పష్టం చేస్తూ కొత్త పార్టీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. తనకు రాజకీయంగా అండగా నిలిచిన నిజామాబాద్ జిల్లా నుంచే తన కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాలని కవిత భావిస్తున్నారు. ఇక్కడి నుంచే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనే యోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.
